సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో తీవ్రమైన ఎండా దెబ్బకు , మరో ప్రక్క తీవ్రమైన ఉక్కపోతతో గత 4 రోజులుగా ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉత్తర భారతం నుండి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. ఎత్తు తక్కువగా ఉండడం, వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పలు జిల్లాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు, వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించాలని.. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలని.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని పేర్కొంది. కాటన్ దుస్తులు ధరించి,రోజువారీ ఆహారంలో మాంసాహారం తగ్గించి ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఉండేలా చూసుకోవాలని హితవు చెబుతున్నారు.