సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం నేడు, బుధవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ అధికార వైసిపి తన హవాను కొనసాగించింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో 3 డివిజన్లు, కొవ్వూరు మున్సిపాలిటీలో 9 వార్డులు, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 3 వార్డులను వైసిపి ఏకగ్రీవం చేసుకుంది.ఇక తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులు, అమలాపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6, పిఠాపురంలో 6, సామర్లకోటలో 28 వార్డుల్లో 2, ముమ్మిడివరంలో 20 వార్డుల్లో 1 వార్డును వైసిపి ఏకగ్రీవం చేసుకుంది.