సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఖాతాదారులు ఎంతో నమ్మకంతో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఆ బ్యాంకు ఉద్యోగులే మరోసారి అక్రమంగా తాకట్టు పెట్టి అక్రమ రుణాలు పొందిన వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ గత 7 రోజులుగా కొనసాగుతోంది. ఎంత మేరకు అక్రమంగా రుణాలు పొందారనే విషయమై ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై హైదరాబాద్ కేంద్రంగా అధికారులు ఖాతాదారులకు నేరుగా ఫోన్లు చేసి బంగారంపై ఎంత మేరకు రుణాలు తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు.దీనివల్ల ఖాతాదారులు ఎంతమేరకు రుణాలు తీసుకున్నారనే సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకూ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రూ. 6.5 కోట్ల నగదు ఈ వ్యవహారంలో బ్యాంకు ఇంటి దొంగలు అక్రమంగా తప్పించారని ? అనధికార సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులను సస్పండ్ చేశారు. ఇందులో ఓ ప్రధాన సూత్రధారి తొలి విడత రూ. మూడు కోట్లు చెల్లిస్తానని ఉన్నతాధికారులకు రాయబారం పంపినట్లు కూడా భావిస్తున్నారు. ఈ కుంభకోణాన్ని సీబీఐ లేదా, సీఐడీలకు అప్పగించే యోచనలో బ్యాంకు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తుంది.